ఈ పరిస్థితుల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చెయ్యడం సాధ్యమా?
గత నాలుగు నెలలుగా మూతపడ్డ సినిమా థియేటర్లను పున:ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు సంబంధిత అధికారులు. థియేటర్లు ఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్లోకి ఎంతమందిని అనుమతించాలి, ప్రదర్శనకు ముందు, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలను కూలంకుషంగా చర్చిస్తున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ చెయ్యాలా, వద్దా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం సూచించింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజూ వేలల్లో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లు ఓపెన్ చేసే విషయాన్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం సరైంది కాదని అంటున్నారు.
థియేటర్లో ప్రేక్షకుల్ని మూడు గంటలపాటు కూర్చోబెట్టి వారి ప్రాణాలతో ఆడుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. సురేష్‌బాబుకి తెలుగు రాష్ట్రాల్లో 150 థియేటర్స్ ఉన్నాయి. అలాగే దిల్‌రాజు, అల్లు అరవింద్ చేతిలో కూడా చాలా థియేటర్స్ ఉన్నాయి. వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వెలుగు చూసిన చైనాలో వైరస్ ఉద్ధృతి తగ్గిన వెంటనే థియేటర్స్ ఓపెన్ చేసేశారు. కానీ, ఆక్యుపెన్సీ మాత్రం లేదు. కేవలం 5 నుంచి 10 శాతం మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటే థియేటర్ రన్ చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ థియేటర్లను మూసేశారు.
చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే థియేటర్లకు జనం రాలేదంటే… ఇక్కడ రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాంటప్పుడు థియేటర్స్‌కి ఎవరు వస్తారనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. థియేటర్లో 25 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. థియేటర్లు ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందని ఆలోచించేవారు 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కాబోతోంది. మరి ఈసారి థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













