Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం

టీజర్ కు, ‘కత్తందుకో జానకి’, ‘స్వేచ్చా స్టాండు’ పాటలకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత.. ‘మిత్ర మండలి’ (Mitramandali) చిత్ర బృందం, మూడవ గీతం ‘జంబర్ గింబర్ లాలా’ను హైదరాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఆవిష్కరించింది. మీమ్ గాడ్, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు చిత్ర బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో విద్యార్థుల ఉత్సాహం, బ్రహ్మానందం గారి పట్ల ప్రతి ఒక్కరికీ ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “మిత్ర మండలి వేడుకకు హాజరు కావడం సంతోషంగా ఉంది. కాలేజ్ లో లెచ్చరర్ గా పనిచేస్తున్న సమయంలో ఇంతమంది విద్యార్థులను చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇంతమంది విద్యార్థులను చుస్తూండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అందరూ కుర్రోళ్లే. అందుకే వీళ్లందరితో కలిసి నటించాలనే ఉద్దేశంతో ఈ సినిమా అంగీకరించాను. నాకు అత్యంత ఆప్తుడు బన్నీ వాసు.. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఎలాగైనా ఉండాలని, నన్ను తీసుకొచ్చాడు. అందరూ హాయిగా నవ్వుకునే సినిమా తీయాలనే గొప్ప ఆలోచన చేసిన నిర్మాతలు కళ్యాణ్, భాను, విజయేందర్ గార్లకు నా అభినందనలు. కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవారికి అనవసరం. తమ జీవితం ఎలా ఉన్నా, అందరినీ నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్నారు కమెడియన్స్. అందుకే కమెడియన్స్ ని ఆశీర్వదించండి, కామెడీని బ్రతికించండి. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వస్తే మోక్షం కలుగుతుంది. ఇలాంటి మంచి చిత్రాలను అందరూ ఆదరించండి. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరి అభిమానాన్ని పొందటం నా అదృష్టం. అక్టోబర్ 16న మిత్ర మండలి విడుదలవుతుంది. ఇది కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని నమ్ముతున్నాను.” అన్నారు.
కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “మీరు మాపై చూపిస్తున్న ప్రేమ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. ఏకలవ్య శిష్యుడిగా బ్రహ్మానందం గారి సినిమాలు చూసి పెరిగాను. పద్మభూషణ్ అవార్డుకు అర్హులైన బ్రహ్మానందం గారితో వేదికను పంచుకోవడం.. కల నిజమైనట్లుగా ఉంది. ఈ సినిమా చూసి థియేటర్లలో అందరూ బాగా నవ్వుతారని హామీ ఇస్తున్నాను.” అన్నారు.
నాయిక నిహారిక ఎన్.ఎం మాట్లాడుతూ.. “నేను కూడా ఇంజినీరింగ్ చేసి, ఇక్కడికి వచ్చాను. నాకు బ్రహ్మానందం స్ఫూర్తి. నేను సోషల్ మీడియాలో కామెడీ కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రేరణ బ్రహ్మానందం గారే. నా మొదటి సినిమాలోనే ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.
నటుడు రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “నేను కూడా బ్రహ్మానందం గారి అభిమానిని. ఆయనంటే నాకు పిచ్చి. బ్రహ్మానందం గారితో వరుసగా మూడు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు.” అన్నారు.
నటుడు విష్ణు ఓఐ మాట్లాడుతూ.. “నా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు బన్నీ వాస్ గారు, కళ్యాణ్ గారు, భాను ప్రతాప గారు, విజయేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. బ్రహ్మానందం గారితో కలిసి ‘కీడా కోలా’ సినిమాలో నటించాను. ఇప్పుడు ఆయనతో వేదికను పంచుకోవడం గర్వంగా ఉంది.” అన్నారు.
నటుడు ప్రసాద్ బెహారా మాట్లాడుతూ.. “మిత్ర మండలి సినిమా మీ అందరిలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అక్టోబర్ 16న వెండితెరపై ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.
చిత్ర సమర్పకులు బన్నీ వాసు మాట్లాడుతూ.. “మిత్ర మండలి సినిమా ప్రేక్షకుల ముఖంపై నవ్వులు పూయించడానికే తీస్తున్నాం. బ్రహ్మానందం గారితో మొదటిసారి స్టేజ్ షేర్ చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని క్షణం. బ్రహ్మానందం మన అందరి జీవితంలో భాగమైపోయారు. ఆయనే ఒక భాషలా మారిపోయారు. మన ప్రతి భావాన్ని ఆయన మీమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే పంచుకుంటాం. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బ్రహ్మానందం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రాబోయే 25 రోజులు సోషల్ మీడియాలో మిత్ర మండలి మాత్రమే కనిపిస్తుంది.” అన్నారు.
చిత్ర నిర్మాత విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ.. “ఇక్కడే ‘హాయ్ నాన్న’ సినిమాలోని ‘ఒడియమ్మా’ పాటను విడుదల చేశాం. అది హిట్ అయ్యింది. ఇప్పుడు ‘జంబర్ గింబర్ లాలా’ కూడా హిట్ అవుతుంది.” అన్నారు.
చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ.. “నా మొదటి సినిమాలో బ్రహ్మానందం గారు ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. మా నాన్నగారు బ్రహ్మానందం గారికి పెద్ద అభిమాని. నేను కూడా చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. బ్రహ్మానందం గారిని ఈ సినిమాలోకి తీసుకొచ్చినందుకు మా నిర్మాతలకు కృతజ్ఞతలు” అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ తన హిట్ పాటలతో పాటు, ఓజీ చిత్ర గీతాన్ని పాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “మిత్ర మండలి నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా. మా నిర్మాతలకు కృతజ్ఞతలు. బ్రహ్మానందం గారి ప్రసిద్ధ ‘జంబర్ గింబర్ లాలా’ డైలాగ్ పై పాట చేయాలన్న మా దర్శకుడి ఆలోచనకు ఆశ్చర్యపోయాను. ఈ పాట ద్వారా బ్రహ్మానందం గారి పట్ల నా అభిమానాన్ని పూర్తిగా చూపించాను.” అన్నారు.
బన్నీ వాస్ కి స్థాపించిన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామ వ్యవహరిస్తున్నారు. హాస్య భరిత చిత్రంగా రూపొందుతోన్న ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.