ఏఐ ముప్పుపై కృతి సనన్ ఆందోళన.. కఠిన చట్టాలు అవసరమంటూ వ్యాఖ్యలు!
సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తున్న మార్పులు ఎంతగా ఉపయోగపడుతున్నాయో.. అదే స్థాయిలో కొత్త సమస్యలకూ కారణమవుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తుల ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారానికి ఉపయోగించే అవకాశాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కృతి సనన్(Krithi Sanon) ఏఐ వినియోగంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. టెక్నాలజీ డెవలప్మెంట్ చెందుతున్న వేగానికి అనుగుణంగా చట్టాలు, కంట్రోల్ సిస్టమ్స్ ముందుకు సాగడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒక మీడియా ఈవెంట్ లో మాట్లాడిన కృతి.. ఏఐ సాయంతో రూపొందించిన ఫోటోలు, వాస్తవ ఫొటోల మధ్య తేడాను గుర్తించడం రోజురోజుకూ కష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఫేస్‌లను పోలిన ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వ్యక్తిగత గోప్యతకు సవాలుగా మారుతోందని వివరించారు. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫార్మ్స్ లో తమ రూపాన్ని పోలిన ఏఐ ఫోటోలను తొలగించేందుకు స్పష్టమైన ఫిర్యాదు విధానం లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌పై చర్యలు తీసుకునేలా ప్రత్యేక నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు తాను వ్యతిరేకం కాదని, అయితే వాటి వినియోగంలో బాధ్యత తప్పనిసరిగా ఉండాలని కృతి స్పష్టం చేశారు. ఏఐ ఒక టూల్ మాత్రమే అయినప్పటికీ, దానిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తుల గుర్తింపు, హక్కులు, గోప్యతకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు, సోషల్ మీడియా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏఐ వినియోగానికి సంబంధించి కఠినమైన చట్టాలు, సమర్థవంతమైన నియంత్రణ చర్యలు అవసరమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.








