రిస్క్ చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమయ్యింది. కొందరు సెలబ్రిటీలకు, మీడియా వారికి వేసిన స్పెషల్ షో నుంచి టాక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది.
ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన గురించి నెట్టింట తెగ మాట్లాడుకుంటున్నారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మార్చి 22న ఈ సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే అంతా బానే ఉంది కానీ ఈ నెల మొదటి నుంచి రెండో వారం దాకా ఖాళీగా ఉన్న డేట్లను మిస్ చేసుకుని, 22వ తేదీని కన్ఫర్మ్ చేయడం అనేది కృష్ణవంశీ తీసుకుంటున్న రిస్క్ లాగానే ఉంది. ఎందుకంటే అదే రోజున విశ్వక్ సేన్ నటిస్తున్న ధమ్కీ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు లేకపోయినా, ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే ధమ్కీకి హైప్ బాగానే ఉంది.
దానికితోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ని గెస్టుగా తీసుకువచ్చి, సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాలని చూస్తున్నారు. ఇది కాకుండా అసలైన సమస్య మరోకటి ఉంది. ఈ నెల 30న నాని నటించిన దసరా సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలున్నాయి. మరి ఇలాంటి టైమ్‌లో వీటన్నింటినీ దాటి, రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ ఉన్న సినిమా ఏ మేరకు నెగ్గుకొస్తుందో చూడాలి.













