‘రంగమార్తాండ’ ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ!
క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. స్టార్ హీరోలతోనే కాదు యంగ్ హీరోలతోనూ తనదైన శైలిలో సినిమాలు చేసే కృష్ణవంశీకి ఈమధ్యకాలంలో సరైన హిట్ లేదు. దీంతో డైరెక్టర్‌గా కొంత విరామం తీసుకున్న వంశీ ఇప్పుడు `రంగమార్తాండ` అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రమకృష్ణ, ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం, శివాత్మిక, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2016లో విడుదలైన మరాఠి సూపర్‌హిట్ మూవీ `నటసామ్రాట్`కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు తన సొంత కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్న వంశీ మొదటిసారి ఓ రీమేక్‌పై దృష్టిపెట్టాడు.
రెండేళ్ళ క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా గురించి మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయినప్పటికీ చిత్ర యూనిట్ దానిపై స్పందించలేదు. ఈ సినిమా ఆగిపోయిందని, అందుకే ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని చెప్పుకుంటున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ విషయంపై కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో చిత్ర యూనిట్‌కి క్లారిటీ లేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్నో గొప్ప సినిమాలు రూపొందించి అందరు డైరెక్టర్లలోకి తనకో ప్రత్యేకతను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ `రంగమార్తాండ` చిత్రంతో సూపర్‌హిట్ కొట్టి మళ్లీ తన ఉనికిని చాటుకుంటాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













