మీడియాకు షాకిచ్చిన దేవర టీమ్
టాలీవుడ్ లో ఈ మధ్య లీకుల బెడద ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఎంతో సీక్రెట్ గా ఉంచాలనుకున్న విషయాలు సైతం ఏదో రూపంలో బయటకు వస్తున్నాయి. యూనిట్ సభ్యుల్లోవాళ్లే ఎవరోకరు మీడియాకు విషయాన్ని లీక్ చేయడం వల్ల ఆ వార్త ఆ నోటా ఈ నోటా పడి చివరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వరకు వెళ్తుంది.
అందులోనూ ఓ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనే విషయం మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ కు చాలా ముందే బయటకు వచ్చేస్తుంది. ఇన్ని లీకులు జరుగుతున్న ఈ కాలంలో దేవర టీమ్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ తమ సినిమా రెండు భాగాలుగా రాబోతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఈ విషయం కొరటాల శివ అనౌన్స్ చేసేవరకు మీడియాకే కాదు ఎవ్వరికీ తెలియదు. మీడియాకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వకుండా దేవర టీమ్ ఈ విషయాన్ని ప్లాన్డ్ గా అనౌన్స్ చేయడం చూసి అందరూ షాకవుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ విషయం వినగానే షాక్ కు గురయ్యారు. ఎవ్వరూ ఊహించని ఈ పార్ట్2 అప్డేట్ విషయంలో ఎలా స్పందించాలో తెలియక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేవర సినిమా విషయంలో అందరికీ భారీ అంచనాలుండగా, ఇప్పుడు పార్ట్2 ఉంటుందని చెప్పి, ఆ అంచనాలను డబుల్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే దేవర-1 చెప్పినట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.













