Minister Komatireddy : షూటింగ్స్ నిలిపివేయడం సరికాదు : మంత్రి కోమటిరెడ్డి

పని చేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్ (Shootings) నిలిపివేయడం సరికాదని ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation )కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సూచించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వేతన పెంపును సినీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు.
మరోవైపు నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) మంత్రితో భేటీ అయ్యారు. టాలీవుడ్ లో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. దిల్ రాజుతో పాటు నిర్మాతలు సుప్రియ, జెమిని కిరణ్ (Gemini Kiran), దామోదర్ ప్రసాద్ ఉన్నారు. పట్టువిడుపులతో ఉండాలని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించుకోవాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దిల్ రాజుకు సూచించారు.