వెంకీ చేసిన క్యారెక్టర్ లో ఆ యంగ్ హీరో..!
శతమానం భవతి తర్వాత మళ్లీ అలాంటి కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయాడు యువ హీరో శర్వానంద్. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇటీవలే శ్రీకారం చేసినప్పటికీ, రిలీజ్ కు ముందు మంచి హైప్ వచ్చినప్పటికీ.. సినిమా రిలీజ్ తర్వాత మాత్రం రొటీన్ కంటెంటే అని ప్రేక్షకుల ఆదరణకు దూరమైంది. ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అయినా సరే వినోదం లేని సినిమాలను జనాలు చూడటం మానేశారు. శ్రీకారం విషయంలో కూడా అదే జరిగింది.
నటుడిగా శర్వానంద్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. కానీ సినిమాల సెలక్షన్ లో మాత్రం ఏదో పొరపాటు జరుగుతున్నట్లుంది. అందుకే వరుసగా తన ఖాతాలో ఫ్లాప్స్ పడుతున్నాయి. ప్రస్తుతం శర్వా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తన తర్వాతి సినిమా మహా సముద్రం కూడా సీరియస్ డ్రామాగానే సాగనుంది. టైట్ స్క్రీన్ ప్లే లేకపోతే ఎంతటి సీరియస్ డ్రామా అయినా ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో మరోసారి కామిక్ రోల్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు శర్వా. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. ఈ సినిమాలో శర్వా, పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడట. ఇదివరకు ఈ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కామిక్ రోల్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ లో శర్వా కనిపించనున్నాడు. ఇలాంటి సినిమాలైతే జనాల్లోకి ఈజీగా వెళ్తాయనే ఆలోచనతోనే శర్వా ఈ సినిమాకు సైన్ చేశాడని తెలుస్తుంది.













