రివ్యూ : కిరణ్ మాస్ అటెంప్ట్ ‘మీటర్’ డౌన్ అయ్యింది!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు : కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, ధనుష్ పవన్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ సి దిలీప్, సురేష్ సరంగం, సంగీతం : సాయి కార్తీక్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్, సమర్పకులు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
నిర్మాత : చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రమేష్ కడూరి
విడుదల తేదీ : 07.04.2023
టాలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు చేసే యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘వినరో భాగ్యము వీర కథ’తో హిట్టు కొట్టినా… కిరణ్ గతేడాది సెబాస్టియన్ పి సి 524, సమ్మతమే!, నేను మీకు బాగా కావలసినవాడిని చిత్రాలు పరాజయం పొందాయి. తాజాగా ‘మీటర్’ అంటూ ఫుల్ మాస్ సినిమాతో ఈ రోజు ఏప్రిల్ 7న ప్రేక్షకులను పలకరించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణ లో ఈ సినిమా ట్రైలర్, టీజర్లను ఫుల్ మాస్ ‘మీటర్’ కనిపించేలా భారీ ఎత్తున కట్ చేశారు. మరి కిరణ్ అబ్బవరం మాస్ అటెంప్ట్ ఎలా ఉంది? టాలీవుడ్‌లో యంగ్ మాస్ హీరోగా కిరణ్ అబ్బవరం ఎదిగాడా? ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? సమీక్ష లో తెలుసుకుందాం.
కథ:
అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ గా పని చేస్తూ తన నిజాయితీ కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. కొడుకుని ఎస్సై చేయాలనేది ఆయన కల. కానీ అర్జున్ కి పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అయిపోతాడు అర్జున్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డిస్మిస్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో (ధనుష్ పవన్) అర్జున్ కళ్యాణ్‌కి క్లాష్ వస్తుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ కళ్యాణ్ ఇష్టం లేని జాబ్ ను ఎలా చేశాడు ?, నిర్లక్ష్యంగా చేసిన తన జాబ్ కారణంగా జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఈ మధ్యలో అతుల్య రవితో ఎలా ప్రేమలో పడ్డాడు? ఎలక్షన్స్‌లో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి? అసలు మగాళ్లు అంటేనే విరుచుకు పడే ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు? చివరకు అర్జున్ కళ్యాణ్ జాబ్ ఉందా? ఊడింది? అలాగే అర్జున్ కళ్యాణ్ లో ఫైనల్ గా ఎలాంటి మార్పు వచ్చింది ? అనేది మిగతా కథ.
నటీనటుల హావభావాలు:
అర్జున్ కళ్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం అదరగొట్టాడు. ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే మంచి ఎనర్జీ ఇందులో కనిపించింది. పోలీస్ గా కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి న్యాయం చేశాడు కానీ ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు విభిన్న కథలు ఎంచుకుంటే బాగుంటుంది. . కాకపోతే ఓవర్ యాక్షన్ మూమెంట్స్ ను తగ్గించుకుంటే బాగుండేది. హీరోయిన్ అతుల్య రవి పాటలకే పరిమితం అయింది. సప్తగిరి పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు సప్తగిరి బాగా నటించాడు. నెగిటివ్ రోల్‌లో కనిపించిన ధనుష్ పవన్ రొటీన్ విలనిజాన్నే చూపించాడు. హీరో తండ్రి పాత్ర చేసిన నటుడు చక్కగా చేశాడు. పోసాని కృష్ణ మురళిలతో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు రమేష్ కాడూరి ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేకుండా చాలా జాగ్రత్తపడ్డారు. రమేష్ కాడూరి రాసుకున్న కథాకథనాలలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయింది. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ పూర్తి సిల్లీగా సినిమాటిక్ గా సాగాయి. కిరణ్ అబ్బవరంకి యాక్షన్ పై ఉన్న మమకారం కారణంగా చాలా సీన్స్ లో బిల్డప్ షాట్స్ బలవంతంగా ఇరికించబడ్డాయి. ఏ సీన్ బలంగా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా చాలా సన్నివేశాల్లో ఓవర్ బిల్డప్, కథకు అవసరం లేని యాక్షన్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ:
ఆవారాగా తిరిగే హీరో సడెన్‌గా పోలీస్ అవ్వడం, తన జీవితం మొత్తంలో అబ్బాయిలను అసహ్యించుకునే హీరోయిన్ ఒక్క పాటలోనే హీరోని లవ్ చేయడం, స్టేట్ సీఎంని కూడా వణికించే విలన్… హీరో ముందు పిల్లిలా మారిపోవడం ఇలా ఇప్పటికే చాలా సార్లు చూసేసిన సీన్లు ఇందులో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో ట్రంప్, కిమ్ సెగ్మెంట్ చూశాక ఈ ఐక్యూ లెవల్స్ ఉన్న క్యారెక్టరైజేషన్లతో రెండు గంటల సినిమా తీశారా అనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్ అంతా పోలీస్ అవ్వకుండా ఉండటానికి హీరో చేసే ప్రయత్నాలు, పోలీస్ అయ్యాక జాబ్ నుంచి డిస్మిస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ ఇలా సాగుతుంది. ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్‌ల మధ్య ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఇందులో కిరణ్ అబ్బవరం చేసిన యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఇంతకు ముందు చాలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తాయి. కానీ వాళ్లు కూడా ఇప్పుడు అలాంటి సీన్లు చేయకుండా మారుతున్న ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్లు సినిమాలు ఎంచుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం మీటర్‌లో మాస్ ఉన్నప్పటికీ, ఆడియన్స్ రేంజ్‌కు తగ్గ రీడింగ్‌ను రీచ్ అవ్వలేదు. మాస్ అటెంప్ట్ లో ‘మీటర్’ డౌన్ అయ్యింది! కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అయితే కాదు. ఓటీటీలో వచ్చాక ఓ సారి ఓపిక ఉంటే చూడొచ్చు.