కిరణ్ అబ్బవరం తన పంథా మార్చాల్సిందే
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు మామూలుగా అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాలనే సద్వినియోగపరచుకుని మంచి పొజిషన్ కు వెళ్లాలి తప్పించి పొరపాట్లు చేసి కెరీర్ ను నష్టపోకూడదు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాడు.
తనకు వచ్చిన ఛాన్సులను కిరణ్ సరిగా యూజ్ చేసుకోవడం లేదని అందరూ అభిప్రాయపడుతున్నారు. తాజాగా తన నుంచి వచ్చిన రూల్స్ రంజన్ సినిమాకు అందరి నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. ఈ సినిమా చూసినంతసేపు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారన్న చిత్ర యూనిట్ మాటలు చివరకు నవ్వుల పాలయ్యేలా చేశాయి.
ఇప్పటికైనా కిరణ్ తన స్టోరీ సెలక్షన్ విషయంలో పంథా మార్చుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. స్వతహాగా రైటర్ అయిన కిరణ్ అబ్బవరం మరొకరి స్టోరీలను జడ్జ్ చేయడంలో ఎందుకు ఫెయిలవుతున్నాడనేది తను మరోసారి విశ్లేషించుకోవాల్సిన టైమ్ ఇది. రూల్స్ రంజన్ సినిమా చాలా అవుట్ డేటెడ్ సబ్జెక్ట్. ఈ స్క్రిప్ట్ ను అసలు తానెలా ఓకే చేశాడనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే స్టోరీ సెలక్షన్ విషయంలో దారి తప్పిన కిరణ్, ఇకనైనా సరైన దారిలో నడవకపోతే ముందు ముందు ఛాన్స్ లు రావడం కూడా కష్టమని తెలుసుకోవాలి.













