కింగ్ ఆఫ్ గోల్కొండ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి బహుజనవీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతి గడించారు. సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకుని ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్ ఆఫ్ గోల్కొండ. ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో చిత్రం టైటిల్ లోగోను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితం నాటి ఆయన చరిత్రను నేటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది అన్నారు. పాపన్న చరిత్రను వెలుగులోకి రాకుండా ఎంతో మంది ప్రయత్నించినా అగ్నిపర్వతంలా ఎగిసిపడుతూనే ఉందన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, దర్శకుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత పల్లె లక్ష్మణరావు, హీరో వంశీ, ఎ.గురురాజ్, హీరోయిన్లు ఆలేఖ్య, మాధవి, గెహన, వాన్య ఆగర్వాల్ తదితరులు మాట్లాడారు. ఆర్కె ఫిలింప్ పతాకంపై డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.













