శ్రీకృష్ణ జన్మస్థానంలో నటుడు కిక్ శ్యామ్
కిక్ శ్యామ్‌గా తెలుగులో పేరు తెచ్చుకున్న నటుడు శ్యామ్ కటకటాల పాలయ్యాడు. పవన్‌కల్యాణ్ కెరీర్లో ఎవర్గ్రీన్ హిట్‌గా నిలిచిన ఖుషి తమిళ్ రీమేక్ అనే విషయం తెలిసిందే. తమిళ్లో విజయ్ హీరోగా నటించాడు. 2000లో విడుదలైన ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన శ్యామ్ 2009 వరకు తమిళ కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే వచ్చిన రేసుగుర్రం, ఊసరవెల్లి చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ చేశాడు.
ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. తమిళ్లో కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న అతన్ని సోమవారం రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఫోకర్ క్లబ్లో పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో.. పక్కా సమాచారంతో కోడంబాకం పోలీసులు ఫోకర్ క్లబ్‌పై దాడి చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ షాక్‌కి గురైంది. ఇలాంటి ఘటనలు కోలీవుడ్‌లో చాలా అరుదుగా జరిగాయి. శ్యామ్ అరెస్టు విషయం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.













