చంద్రముఖి సీక్వెల్‌కి రంగం సిద్ధం.. హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఛేంజ్?
ఒక సినిమా సూపర్‌హిట్ అయితే దానికి సీక్వెల్ చేయడమనేది ఈమధకాలంలో ఎక్కువైందనే చెప్పాలి. ఇలా సీక్వెల్ చేయడం కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే పాయింటే. ఎందుకంటే మొదటి సినిమా తాలూకు ఇంపాక్ట్ సీక్వెల్ మీద కూడా ఉంటుంది. దాంతో బిజినెస్‌పరంగా ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా స్టార్ కాస్టింగ్ కూడా దానికి తోడవుతుంది కాబట్టి నిర్మాతలు ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల సేఫ్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ఓ సేఫ్టీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుడుతోంది సన్ పిక్చర్స్. 2005లో వచ్చిన `చంద్రముఖి` ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీకాంత్ పెర్ఫార్మెన్స్, పి.వాసు టేకింగ్, జ్యోతిక యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది సన్ పిక్చర్స్. అప్పట్లో చంద్రముఖికి సీక్వెల్ అంటూ నాగవల్లి అనే సినిమాను తెలుగులో రూపొందించారు పి.వాసు. నాగవల్లి సినిమా చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగానే ఉంటుంది.
కానీ, ఇప్పుడు చంద్రముఖికి సీక్వెల్ అంటూ మరో సినిమా చేయడానికి కారణాలు ఏమిటో తెలీదు. ఇటీవల ముని, కాంచన సిరీస్‌లతో ఆడియన్స్‌ని బాగా థ్రిల్ చేస్తున్న రాఘవ లారెన్స్‌కి ఈ సీక్వెల్ బాధ్యతను అప్పగించారు. కాంచన చిత్రాన్ని హిందీలో లక్ష్మీబాంబ్ పేరుతో లారెన్స్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా షూటింగ్లో ఆమె పెర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో చంద్రముఖి2లో కియారా అద్వానీని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు లారెన్స్. అంతేకాదు ఈ సీక్వెల గురించి కియారాకు చెప్పడం, ఆమె ఓకే అనడం కూడా జరిగిపోయాయని సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్‌కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.













