కేజీఎఫ్ నిర్మాత ‘ఎవ్రీ’ తెలుగు లోకల్ ఛానెల్ పై పైరసీ కేస్
నేషనల్ వైజ్ ప్రజాదరణ పొందిన కె జి ఎఫ్ చాప్టర్ 1 విడుదలై 17 నెలలైంది ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించిన డిజిటల్, సాటిలైట్ హక్కులు ఎవరికి ఇవ్వలేదు అయినా ఎలాంటి అనుమతి లేకుండా కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని టెలికాస్ట్ చేసిన తెలుగు టెలివిజన్ ఛానెల్‌పై కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నది. తమ అనుమతి, ఒప్పందం లేకుండా సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని చెబుతూ లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదించామని నిర్మాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకు ఈ వివాదంలో ఏం జరిగిందంటే..
2018లో తెలుగు డబ్బింగ్ చిత్రంగా రిలీజైన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని అందుకొన్నది. యష్‌కు తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ లభించింది. యష్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలమేర వసూలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.225 కోట్లు వసూలు చేసిందంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆడిందో ఊహించ వచ్చు.
కేజీఎఫ్ చాప్టర్ 1 సక్సెస్‌తో నిర్మాతలు సీక్వెల్‌ను వెంటనే ప్రారంభించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం మరో ప్యాన్ ఇండియా మూవీగా ప్రస్తుతం తెరకెక్కుతున్నది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టాండన్, తెలుగు నటుడు రావు రమేష్ నటిస్తున్నారు. దీంతో కేజీఎఫ్పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో కేజీఎఫ్ శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అక్రమంగా కేజీఎఫ్‌ను లోకల్ ఛానెల్ లో ప్రసారం చేయడం వివాదంగా మారింది.
కేజీఎఫ్ చాప్టర్ 1 ప్రసార వివాదంపై ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ ట్విట్టర్లో స్పందిస్తూ.. చట్ట విరుద్ధంగా, నిబంధనలు ఉల్లంఘించిన మా సినిమాను ఛానెల్లో ప్రసారం చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. ఎవ్రీ అనే లోకల్ తెలుగు ఛానెల్లో అక్రమంగా ప్రసారం చేశారు. వారిపై చట్టపరంగా నష్టపరిహారం దావా వేస్తున్నాం అని చెెప్పారు. ఓ వైపు శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఈలోగా లోకల్ చానెల్ ప్రసారం చేయడం దారుణం. మా వద్ద ఆ ఛానెల్లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని తెలిపారు.
కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా ఎవరికీ ఇవ్వలేదు. టెలివిజన్ ప్రీమియర్‌కు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవ్రీ ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపై కోర్టు నుంచి లీగల్ నోటీసుల పంపుతాం అని యూనిట్ సభ్యులు వెల్లడించారు. దక్షిణాదిలో యదేచ్ఛగా పైరసీ లోకల్ ఛానెల్ లలో ప్రసారం రెగ్యులర్‌గా జరుగుతున్నది. ఇలాంటి చెడ్డ సంస్కృతి లోకల్ చానెల్స్‌లో ఉంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌పై ఈ ఛానెల్స్‌కు కనీస గౌరవం లేదు. తమిళనాడులో ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడిన కొన్ని ఛానెల్స్ యజమానులను అరెస్ట్ చేశారు. వాళ్ల ఆఫీసులను కూడా సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.













