ఘనవిజయాలు అందుకుంటున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో చేస్తున్న రెండు సినిమాలు!
దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో ప్యాన్ ఇండియా హవా నడుస్తోంది. ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారూ అంటే దాన్ని వివిధ భాషల్లో పిక్చరైజ్ చెయ్యడమా లేక డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడమా అనే విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో బాహుబలి, సాహో వంటి సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొంది సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్, త్వరలో ప్రారంభం కానున్న నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్.. ఈ మూడు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి. ఈమధ్యకాలంలో తెలుగు దర్శకుడు రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా అతను తెరకెక్కించిన కెజిఎఫ్ దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సాధారణంగా ఒక ప్రాంతీయ భాషా చిత్రం జాతీయ స్థాయిలో కమర్షియల్‌గా హిట్ సాధించడం అసాధ్యం. దాన్ని సుసాధ్యం చేసి చూపించారు రాజమౌళి, ప్రశాంత్ నీల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు వీరిద్దరి డైరెక్షన్లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ ఛాప్టర్2 చిత్రాలపైనే ఉంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రూపొందుతున్నాయి. ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత చేయబోయే సినిమాలు ఏమిటి? అనే విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్‌తో సినిమా చేయబోతున్నట్టు ఇంతకుముందే రాజమౌళి ప్రకటించాడు. ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రం షూటింగ్లో ఉన్న మహేష్ అది పూర్తవగానే రాజమౌళి సినిమాలో జాయిన్ అవుతాడు. ఈలోగా రాజమౌళి కూడా ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ చేసేస్తానని చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఎన్టీఆర్తోనే అనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ట్విట్టర్లో ఛాట్ చేస్తూ కెజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్… వీరిద్దరిలో ఎవరితో సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పడం అందర్నీ కన్ఫ్యూజన్లో పడేసింది. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ చెయ్యాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసే అవకాశం ఇప్పట్లో లేదు. మరి ప్రశాంత్ అలా ఎందుకు అన్నాడు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్, ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశం ఉంది. స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం అతను కమిట్ అయిన మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎవ్వరూ అటెమ్ట్ చెయ్యని ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు ప్రశాంత్ కసరత్తులు చేస్తున్నాడు. ప్రభాస్ సినిమా తర్వాత మహేష్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ప్రశాంత్‌నీల్ మొదటి సినిమా ఉగ్రం. కన్నడలో 4 కోట్లతో తీసిన ఈ సినిమా 40 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత చేసిన కెజిఎఫ్ కూడా కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ అయింది. వరస విజయాలతో ముందుకెళ్తున్న ప్రశాంత్ కెజిఎఫ్ 2 తర్వాత రెండు సినిమాలు తెలుగులోనే చేయాలని డిసైడ్ అవ్వడం విశేషం.













