కరోనా రెండవ దశ విజృంభణ తో ‘కే.జీ.ఎఫ్-2 రిలీజ్ డేట్ మారనుందా?
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై గట్టిగా పడింది. ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి కారణంగా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దక్షిణాదిన కూడా త్వరలో ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పాన్ ఇండియా మూవీస్ గా ప్రసిద్ధి చెందిన సినిమాలు విడుదల తేదీల విషయం లో తర్జన భర్జన పడుతున్నాయి. కొందరైతే తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.ఎఫ్-2’ కూడా ఇదే పరిస్థితి వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ దావానలంలా వ్యాపిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ. ప్రతీ రోజు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. కొన్ని చోట్ల రాత్రిపూట, మరి కొన్ని ప్రాంతాల్లో వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ ఈసారి సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. ఇక పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయిలో ఉండటంతో సినిమా థియేటర్లను మూసి వేయడం.. లేదా.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం చేస్తున్నారు.
ఈ క్రమంలో పలు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ వైరస్ ప్రభావం ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘కే.జీ.ఎఫ్-2’పై కూడా పడినట్లు అనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 ఉత్తర భారతదేశంలో కూడా రికార్డు కలెక్షన్స్ నమోదు చేసుకుంది ఇది దృష్టిలో పెట్టుకుని, దీంతో ఈ సినిమాని ఏకకాలంలో అన్ని భాషల్లో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో, సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. రాక్‌స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన ‘కే.జీ.ఎఫ్’ సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన కే.జీ.ఎఫ్ ఏ రేంజ్లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి భాగం చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు రెండో భాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూలై 16న సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ రావడం.. థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదల తేదీ మారుతుందేమోనని అనుకుంటున్నారు.













