శ్రీదేవి సినిమా సీక్వెల్లో కీర్తి సురేష్
లోకనాయకుడు కమల్‌హాసన్, అతిలోక సుందరి శ్రీదేవి.. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అంటే ఈ జంటకు ప్రేక్షకుల్లో అంత ఆదరణ ఉండేది. 1976 నుంచి 1986 మధ్యలో దాదాపు 21 సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా `ఒక రాధ ఇద్దరు కృష్ణులు`. ఈ సినిమా విడుదలై 34 సంవత్సరాలైంది. కమల్, శ్రీదేవి జంటగా నటించిన `ఎర్రగులాబీలు` సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో వీరిద్దరి నటన తారాస్థాయిలో ఉంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా సూపర్‌హిట్ అయి ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. తమిళ్లో `సిగప్పు రోజాక్కల్` పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో `ఎర్రగులాబీలు`గా అనువదించారు. ఈ సినిమాలోని నటనకుగాను ఉత్తమ నటుడిగా కమల్‌హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాను 1980లో `రెడ్‌రోజ్` పేరుతో హిందీలో రీమేక్ చేశారు భారతీరాజా. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా, పూనమ్ థిల్లాన్ జంటగా నటించారు.
దాదాపు 42 సంవత్సరాల తర్వాత ఎర్రగులాబీలు సినిమాకు సీక్వెల్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా ఈ సీక్వెల్ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సీక్వెల్‌కి భారతీరాజా అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. మరోసారి ఇళయరాజా ఈ సీనిమాకు సంగీతం అందించనున్నాడు. నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలని 2009లో అనుకున్నారు మనోజ్ భారతీరాజా. అప్పట్లోనే అజిత్, ధనుష్‌లకు ఈ కథను చెప్పడం జరిగింది. అది వర్కవుట్ కాలేదు. మనోజ్ 1999 నుంచి నటుడిగా కొనసాగుతున్నాడు. అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. అజిత్, ధనుష్‌లతో సీక్వెల్ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో శంకర్, మణిరత్నం వంటి దర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. 2014లో మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ, అప్పుడు కూడా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ సీక్వెల్ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి చేసిన పాత్ర కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించారట. ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.













