పరిస్థితి ఇలా ఉంటే విజయనిర్మల బయోపిక్ కోసం కీర్తి సురేష్‌ని మహేష్ సంప్రదిస్తాడా?
అదృష్టం అనేది ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్‌గా బాగా ఉంటుంది. హీరో లేదా హీరోయిన్ అవుదామని వచ్చే నటీనటులు ఎప్పటికైనా మంచి అవకాశం రాకపోతుందా మనకు బ్రేక్ రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొంతమందికి కొన్ని సినిమాల తర్వాత వారు కోరుకున్న బ్రేక్ వస్తుంది. అప్పటివరకు ఎవరూ పట్టించుకోని వారు ఆ హీరోని లేదా హీరోయిన్ని అందలం ఎక్కిస్తారు. వారితో సినిమాలు చేసేందుకు క్యూ కడతారు. కొంతమందికి మొదటి సినిమాతోనే ఆ బ్రేక్ వచ్చేస్తుంది. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆర్టిస్టుగా టాప్ రేంజ్‌కి వెళ్లిపోతారు. హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలో అదే జరిగింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినా అందమైన హీరోయిన్ అని, మంచి నటి అని ప్రశంసలు వచ్చాయి. ఎప్పుడైతే `మహానటి` సినిమా చేసిందే ఆమె ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో నిజంగానే మహానటి అనిపించింది. ఆమెను అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు కూడా ఆ రేంజ్‌లోనే వస్తున్నాయి. మహానటి తరహా కథలు కూడా ఆమె దగ్గరకు రావడం, ఇకపై తాను బయోపిక్‌లలో నటించబోనని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ అలాంటి సినిమాలనే ఓకే చేస్తోంది.
ఇదిలా ఉండగా హీరోయిన్గా, దర్శకురాలిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని ప్రపంపంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకన్న విజయనిర్మల జీవితకథను తెరకెక్కించాలని ఆమె కుమారుడు నరేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్‌కు కీర్తి సురేష్ అయితే న్యాయం చెయ్యగలదని భావించి ఆమెను సంప్రదించగా ఎప్పటిలాగే ఆమె ఆ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో హీరో మహేష్ సహకారాన్ని కోరాడు నరేష్. ఎందుకంటే మహేష్ కొత్త సినిమా `సర్కారువారి పాట`లో హీరోయిన్గా నటిస్తోంది కీర్తి సురేష్. ఆమెను స్వయంగా కలిసి విజయనిర్మల బయోపిక్ గురించి డిస్కస్ చేసి ఆమెను ఒప్పించాలని మహేష్ డిసైడ్ అయ్యాడట. మరోపక్క ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నట్టు తెలిసింది. సూపర్‌స్టార్ అయి ఉండి ఈ సినిమా కోసం కీర్తిని సంప్రదించడం వారికి ఇష్టం లేదు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. మరి నరేష్ కోసం మహేష్ ఆమెను సంప్రదిస్తాడో, ఫ్యాన్స్ కోసం వెనక్కి తగ్గుతాడో చూడాలి.













