మహానటితో ఇలా అయితే కష్టమే..!
తెలుగు పరిశ్రమకు ఈ మధ్య కాలంలో పరిచయమైన ముద్దుగుమ్ముల్లో కీర్తి సురేష్ ఒకరు. తన అందం, అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. మహానటి తర్వాత తన మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది.
ఈ తరుణంలో కీర్తి తాజా చిత్రమైన రంగ్ దే విడుదలకు సిద్ధమైంది. నితిన్ తో కలిసి నటించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ ఎంటర్టైనర్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.
టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్న కీర్తికి రంగ్ దే విజయం చాలా ముఖ్యం. మహానటి తో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు దాన్ని పట్టించుకోకుండా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. తర్వాత మన్మథుడు2 చేసినా ఏం ఉపయోగం లేదు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు చేసి పెద్ద పొరపాటే చేసింది. ఇప్పుడు కీర్తి చేతిలో ఉన్న సినిమా గుడ్ లక్ సఖి మాత్రమే. కానీ దానికి ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు. ఇలాంటి టైమ్ లో కీర్తికి రంగ్ దే సక్సెసే తనను ఆదుకోవాలి. రంగ్ దే, సర్కారు వారి పాట హిట్ అయినా సరే కీర్తి వెంటనే ఇక్కడ సినిమాలు చేసే ఛాన్స్ లేదు. దీనికి కారణం తమిళం, మలయాళంలో తను ఒప్పుకున్న సినిమాలే. క్రేజ్ వచ్చినప్పుడు అందుబాటులో లేకుండా, సరిగా పట్టించుకోకపోతే కీర్తికి టాలీవుడ్ లో ఉన్న స్థానం కోల్పోవాల్సిందేనేమో.













