మరో బయోపిక్ లో మహానటి
మహానటిలో సావిత్రిగా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్లీ ఆ స్థాయి సినిమా చేసింది లేదు. నాగ్ అశ్విన్ ఆ సినిమాను ఎంత గొప్పగా తెరకెక్కించాడో అంతకంటే గొప్పగా కీర్తి ఆ పాత్రకు ప్రాణం పోసింది. అయితే ఇప్పుడు మళ్లీ కీర్తి చాలా గ్యాప్ తర్వాత మరో లెజెండరీ బయోపిక్ చేసే ఛాన్సుందని కోలీవుడ్ టాక్. అది మరెవరిదో కాదు, లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్.
వెంకటేశ్వర సుప్రభాతంతో ప్రతి ఇంటా కొలువుతీరిన ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితాన్ని తెరకెక్కించేందుకు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరన్నది తెలియదు కానీ టైటిల్ రోల్ లో మాత్రం కీర్తి నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సుబ్బలక్ష్మి గారి జీవితంలో ఎన్నో సంఘటనలున్నాయి. మధురైలో ఓ మామూలు మధ్య తరగతి ఫ్యామిలీలో పుట్టి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరులో ఎన్నో మలుపులున్నాయి.
1997లో ఆమె భర్త చనిపోయాక పాడటం ఆపేసిన సుబ్బలక్ష్మి 2004లో కన్ను మూశారు. ఈ బయోపిక్ లో ఒకవేళ కీర్తి సురేష్ నటించకపోతే త్రిష, నయనతార పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. నిజంగా ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తే ఈ తరానికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన వారవుతారు. సుబ్బలక్ష్మి గారు పేరుకే తమిళనాడుకు చెందినా ఆవిడకు ప్రపంచమంతటా ఎంతోమంది అభిమానులున్నారు.













