అలా చేయలేకపోతే నా పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా!
గత నెల 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి. ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. నెపొటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అభిప్రాయపడ్డారు. హీరోయిన్ కంగనా రనౌత్ ఒక అడుగు ముందుకు వేసి సుశాంత్ మరణంపై ఎన్నో ఆరోపణలు చేసింది.
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేసింది. అది ఆత్మహత్య కాదు హత్య అని పేర్కొంది. ఇప్పటివరకు తను చేసిన ఆరోపణలు అబద్దాలైతే.. అవి తాను నిరూపించలేకపోతే భారత ప్రభుత్వం తనకు అందించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది. సుశాంత్ చనిపోయింది ముమ్మాటికీ నెపొటిజం వల్లే అని నొక్కి వక్కాణిస్తోంది. అంతేకాదు ఈ విషయంలో మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించిందని మీడియాపై కూడా విరుచుకుపడింది. పేర్లు ప్రస్తావించకుండా కొందరు జర్నలిస్టులు మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు రాశారని, వాటివల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోయారని వివరించింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరి ఒత్తిడి కూడా ఎదుగుతున్న నటీనటులపై ఉందని ఆరోపించింది.
ఈమధ్య ముంబై పోలీసులు తనను విచారణకు రమ్మని సమన్లు పంపారని, ఆ సమయంలో తాను మనాలిలో ఉండడం వల్ల వారిని అక్కడికి రమ్మని కోరానని చెప్పింది. అయితే అలా చెప్పిన తర్వాత ముంబై పోలీసుల నుంచి ఎలా సమాధానం రాలేదని అంది. ఏది ఏమైనా ఒక హీరోయిన్ తాను చేసిన ఆరోపణలు నిజం కాకపోతే, అవి నిరూపించలేకపోతే ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.













