జయలలితగా కంగనా రనౌత్
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ వెండితెరకెక్కబోతుంది. ఇందులో జయ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. నేడు కంగన పుట్టినరోజు ఈ సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంలో తలైవి గా, హిందీలో జయ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం గురించి విజయ్ మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తున్నామంటే మాపై ఎంతో బాధ్యత ఉంది. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేశం గర్వించే కథా నాయిక కంగనా రనౌత్ ఇందులో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ శతాబ్దంలోనే విజయవంతమైన మహిళల్లో జయ లలిత ఒకరు. రాజకీయ రంగంలో ఆమె ఓ ఐకాన్. ఆమె జీవితం సినిమా కథకు చక్కగా సరిపోతుంది. ఆమె పాత్రలో నటిస్తుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పింది కంగన. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత.













