ఆ సినిమాకు జాతీయ అవార్డు రాకపోతే …
మణికర్ణిక సినిమాకు కానీ, అందులో టైటిల్ పాత్ర పోషించిన తనకు కానీ జాతీయ అవార్డు రాకపోతే ఆ కమిటీపైనే అనుమానాలు మొదలవుతాయని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ హెచ్చరించారు. లోగడ క్వీన్, తను వెడ్స్ మను వంటి చిత్రాలకు జాతీయ అవార్డును ఆమె అందుకుకున్న విషయం తెలిసిందే. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె మీడియాతో కొద్దిసేపు మాట్లాడినపుడు మణికర్ణిక చిత్రం ప్రస్తావన వచ్చింది. ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి. అలాగే మణికర్ణిక చిత్రానికి జాతీయ అవార్డు రాకపోతే అవార్డులు ఇచ్చే కమిటీకే అగౌరవం. నాకన్నా బాగా నటించిన ఇంకెవరికైనా అవార్డు వస్తే కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, ఏకీభవిస్తాను. ఆ సినిమా మణికర్ణిక సినిమాను మించిందై ఉండాలి. కానీ నా మటుకు నేను అలాంటి చిత్రం ఉందని అనుకోవడం లేదు. అంధాధూన్ చిత్రంలో టబు చాలాబాగా నటించారు. ఆమె నటనతో నన్నెంతో ఆకట్టుకుంది. ఆమె నటన ఏ స్థాయిలో ఉందన్న విషయం జాతీయ అవార్డుల ఎంపికలో తెలిసిపోతుంది అని చెప్పుకొచ్చారు.













