ప్రభాస్, అనుష్కలపై తన అభిప్రాయాన్ని చెప్పిన కామ్నా జెఠ్మలాని!
సినిమాల్లో కొన్ని జంటలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ కూడా ఉంటుంది. వారిని హిట్ పెయిర్ అని కూడా పిలుస్తుంటారు. అలాంటి జంటే ప్రభాస్, అనుష్క. వీరిద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా వీరు మంచి జంట అని ప్రచారం జరిగింది. ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని ఫంక్షన్స్‌కి ఇద్దరూ కలిసి హాజరవడం కూడా ఆ వార్తలకు ఊతం ఇచ్చింది. తమ గురించి ఎవరెన్ని చెప్పుకున్నా తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఆ వార్తలను ఖండించారు ప్రభాస్, అనుష్క.
ఇదిలా ఉంటే తెలుగులో ప్రేమికులు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన కామ్నా జెఠ్మలాని రణం, బెండు అప్పారావు ఆర్ ఎం పి తదితర చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 20కి పైగా సినిమాల్లో నటించింది. అయినా ఆమెకు హీరోయిన్గా రావాల్సినంత గుర్తింపు రాలేదు. దాంతో 2014లో బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా కన్నడలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేసింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్న కామ్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.
ఇటీవల అభిమానులతో చేసిన చిట్ చాట్‌లో ఎన్నో విషయాలను వారితో పంచుకుంది. ఈమెకు ప్రభాస్ అంటే పిచ్చి అభిమానం. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించింది. అలాగే హీరోయిన్లలో అనుష్క అంటే ఇష్టమని చెప్పింది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలో కనిపిస్తే తనకు పండగేనని అంటోంది. మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.













