బాలీవుడ్ అంగీకరించినా… మేం ఒప్పుకోం
హిందీ సినీ పరిశ్రమ జీఎస్టీని అంగీకరించినా తాము (దక్షిణాది) ఒప్పుకోబోమని, సినిమాపై విధిస్తున్న 28శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తొలగించాలని లేదా తగ్గించాలని విశ్వనటుడు కమల్‌హాసన్ డిమాండ్ చేశారు. కేంద్రం జీఎస్టీని తగ్గించకపోతే సినిమాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీరంగంపై జీఎస్టీ పన్నుని తగ్గించాలని కొంతకాలంగా దక్షిణాది సినీ పరిశ్రమలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలిం చాంబర్) చెన్నైలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్, ఛాంబర్ అధ్యక్షుడు ఎల్కే సురేష్, థియేటర్ యాజమానుల సంఘం తరపున అభిరామి రామనాథన్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 28 శాతం జీఎస్టీ విధిస్తే సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, దీనిని 12 లేదా 18కి తగ్గించాలని ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.













