టాలీవుడ్ నిర్మాతలకు కల్కి టెన్షన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898ఏడి. ఈ సినిమా మే 9న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కల్కి షూటింగ్ చివరి దశలో ఉందని కొందరంటుంటే, కాదు ఇప్పుడు షూట్ చేస్తుంది కల్కి సెకండ్ పార్ట్ అని మరికొందరంటున్నారు.
ఇదిలా ఉంటే మేకర్స్ చెప్పన ప్రకారం కల్కి రిలీజ్ కు మరో 80 రోజులు మాత్రమే ఉంది. ఈ లోపు కల్కి విఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం పూర్తి చేయగలరా అనే అనుమానాలు తెలుగు పరిశ్రమలో బాగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా చెప్పిన డేట్ కే రావాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఎందుకంటే తమ బ్యానర్ నుంచి వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహా నటి లాంటి సినిమాలు అదే రోజున రిలీజై మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో కల్కిని కూడా అదే రోజున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అన్నీ బాగుండి సినిమా చెప్పిన తేదీకి వస్తే బానే ఉంటుంది అలా కాకుండా వాయిదా పడితే మాత్రం మిగిలిన సినిమాలు, ఆయా నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడే ఛాన్సుంది. గతంలో సలార్ విషయంలో కూడా ఇదే పొరపాటు జరిగింది. రిలీజ్ డేట్ ను మార్చుకోవడం వల్ల ఇతర సినిమాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మళ్లీ కల్కి కూడా వాయిదా పడితే ఎలా అని చిత్ర నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.













