Kalivi Vanam: నవంబర్ 21 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న “కలివి వనం”..
మీడియా మిత్రుల చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్..
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం(Kalivi Vanam). ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను సీనియర్ జర్నలిస్ట్ లు రవిచంద్ర, ఫణి, కేశవ చారి, సినీ జోష్ రాంబాబు, శివ మల్లాల, రాధా కృష్ణ ట్రైలర్ & నవంబర్ 21 డేట్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం
చిత్ర నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. పరిసరాల మీద అంటే అడవిలో చెట్లు మనకు ఎంత ఉపయోగపడతాయన్న దాని మీద ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మా చిత్ర,,దర్శక నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బులకు ఎక్కడా వెనకాడకుండా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చిత్రీకరణ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమా. మీడియా వారంతా మా కలివి వనం సినిమాను ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ.. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా 100% నచ్చుతుందని ఆశిస్తున్నాను. . ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ అన్నకు, ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డికి థ్యాంక్స్ అన్నారు.
చిత్ర దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ ..ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి ఒక గెస్ట్ ని తీసుకురావడం చాలా కష్టం.ఈ సినిమాకు గెస్టుల కోసం మేము చాలా రోజులు ట్రై చేసినాం. వస్తామన్నారు, రాలేదు. ఒక మంచి సినిమాను ఆదరించడానికి సినిమా ఫీల్డ్ లో ఒక గెస్ట్ కూడా రాలేకపోతున్నారు. ఈరోజు మాకు అండగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. వాళ్లే మా బలం, మా బలగం, వాళ్లే మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ – “కలివి వనం” చిత్ర ట్రైలర్ ను మీడియా మిత్రుల చేతుల మీదుగా లాంచ్ చేసుకోవడం జరిగింది.
కలివివనం చిత్ర పోస్టర్ మీద ఒక కొటేషన్ రాశా. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా అని. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన సినిమా ఈ కలివి వనం. .ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో సినిమా చూడలేక పోతున్నారని మనం సోషల్ మీడియాలో గానీ అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇది అలాంటి సినిమా కాదండి, ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని చూడాల్సిన సినిమా అని కచ్చితంగా చెప్పగలను.ఇందులో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి సినిమా.ప్రతి తల్లిదండ్రులను నేను కోరుకునేది ఒక్కటే, ఈ సినిమాను చూయించండి.
సినిమాను ఎందుకు చూయించాలంటే ఇది వాళ్ళ జీవిత శైలిలో ఒక పాఠ్య భాగం లాగా, ఒక పెద్ద భాల శిక్షలో ఒక పేజీ లాగా ఈ సినిమా వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. ఇది పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఈ సినిమాలో దొరుకుతుంది. నేను ఇంతకుముందు ఒక టీజర్ లాంచ్ లోనే చెప్పినట్లు.. వర్షం ఎలా వస్తుంది నాన్న అంటే. దేవుడు కురిపిస్తున్నాడమ్మా అని చెప్పకూడదు పిల్లలకి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అని చెప్పండి. ఇలా పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు నుండే వాళ్ళ మెదళ్ళలో నాటితే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహా వృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేయాలి. 20 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఇస్తే పని చేయదు. మనం దేవునితో పాటు ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతిని కూడా ఆరాధించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలన్న విషయం పిల్లలకి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.







