మన చందమామకు అరుదైన గౌరవం
పంచదార బొమ్మ తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆమె మైనపు బొమ్మ సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరబోతోంది. ఈ మేరకు ఇటీవల కాజల్ రూపురేఖలకి సంబంధించిన కొలతల్ని సేకరించారు మ్యూజియం ప్రతినిధులు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది కాజల్. చిన్నతనంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకి వెళ్లినప్పుడు, అక్కడి ప్రముఖుల మైనపు బొమ్మల్ని చూసి ఎంతో స్ఫూర్తిని పొందా. ఇప్పుడు వాటి పక్కన నా బొమ్మ కూడా చేరబోతున్నందుకు ఎంతో గౌరవంగా ఉంది. కొత్త దశాబ్దం నుంచి పనులతో ప్రారంభం కాబోతోంది. కష్టానికి, వ్యక్తిగత త్యాగానికి తగిన గుర్తింపు లభించబోతోంది. ఇన్నేళ్లు నాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతతో ఉంటా అని ట్వీట్ చేశారు కాజల్. నేనే రాజు నేనే మంత్రి తో యాభై సినిమాలు మైలురాయిని అధిగమించి, కొత్త అవకాశాలతో దూసుకెళుతున్న కాజల్ మైనపు బొమ్మని వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ఆవిష్కరించబోతున్నారు.













