టీజర్‌తోనే భలే ఆఫర్లొస్తున్నాయిగా!
రాజా వారు రాణి గారు సినిమాతో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఓటీటీలో మాత్రం తన ముద్ర వేయగలిగాడు. సెకండ్ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా మిక్డ్స్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ ను తీసుకురాగలిగాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ ఛాన్స్ ను వాడుకోవాలని చేసిన సినిమాలన్నీ తన కెరీర్ ను డ్యామేజ్ చేశాయి. సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్లయ్యాయి. దీంతో అందరూ కిరణ్ పనైపోయిందనుకున్నారు. కానీ ఇప్పుడు కిరణ్ తన కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవాలని చాలా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్న కిరణ్ అబ్బవరం, మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడని టాక్.
ఇదిలా ఉంటే రీసెంట్ గా కిరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన క అనే పాన్ ఇండియా సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ టీజర్ ఉంది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్లొస్తున్నట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ ను కొనడానికి బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తున్నారట. డిజిటల్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకు కిరణ్ కూడా ఒక నిర్మాత కావడంతో సినిమాను కొన్ని ఏరియాల వరకు సొంతంగా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడట. ఏదేమైనా ఒక్క టీజర్ తో కిరణ్ తన సినిమాకు బిజినెస్ చేసేయడమంటే మాటలు కాదు.













