అప్పుడు బన్నీ ఫాదర్ గా, ఇప్పుడు మహేష్ ఫాదర్ గా..
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట. బ్యాంక్ మోసాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ తన తండ్రిని మోసం చేసిన వాళ్ల అంతు చూసే కొడుకుగా కనిపిస్తారని సమాచారం. అసలు ఈ సినిమాలో మహేష్ ఫాదర్ గా ఎవరిని తీసుకోవాలా అని చాన్నాళ్లు ఆలోచించాక జయరామ్ ను ఫైనల్ చేశారట.
మలయాళ సీనియర్ యాక్టర్ జయరామ్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతేడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలో బన్నీ తండ్రి రామచంద్రగా నటించారు. ఆ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో సర్కారు వారి పాట సినిమా లోనూ అతన్నే తండ్రి పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తుంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ సినిమాలో ఆయన ఒక బ్యాంకు మేనేజరుగా కనిపించనున్నారట. మొత్తానికి టాలీవుడ్ మేకర్స్ కు జయరామ్ రూపంలో ఒక మంచి నటుడు దొరికాడు. అంతే కాకుండా, పాన్ ఇండియా రేంజ్ లో సినిమా కాబట్టి, మలయాళం ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకునేందుకు జయరామ్ ఉపయోగపడొచ్చనే ఆలోచనతో ఆయన్ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముంది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













