Janhvi Kapoor: వరుణ్ ధావన్ కు మద్దతిస్తూ జాన్వీ పోస్ట్

నటి షెఫాలీ జరీవాలా(shefali jariwala) రెండ్రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శనివారం షెఫాలీ అంత్యక్రియలు జరగ్గా అక్కడ మీడియా ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్(Varun dhawan) చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పుడు వరుణ్ వ్యాఖ్యలకు మద్దతుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(janhvi kapoor) రంగంలోకి దిగింది.
ఒకరి ఆత్మకు సంబంధించిన విషాద వార్తను మీడియా కనీసం దయ లేకుండా కవర్ చేసిందని, ఒకరి దుఃఖాన్ని ఎందుకు ప్రసారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని, దాన్ని చూసేందుకు అందరూ చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారని, దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, ఎవరూ తమ ఆఖరి యాత్రను ఇలా కవర్ చేయాలని కోరుకోరని వరుణ్ ధావన్ అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పుడు వరుణ్ పోస్ట్ కు జాన్వీ మద్దతిస్తూ అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు ఇన్‌స్టాలో అతని పోస్ట్ ను షేర్ చేస్తూ స్టోరీ పెట్టింది. ఎట్టకేలకు ఎవరోకరు ఈ విషయం చెప్పారని, బాధలో ఉన్న వాళ్లకు కనీసం ప్రైవసీ ఇవ్వాలని జాన్వీ ఈ సందర్భంగా తెలిపింది. వరుణ్ ధావన్ కు సపోర్ట్ చేస్తూ జాన్వీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.