హాలీవుడ్లో తెలుగువాడికి అవకాశం
హాలీవుడ్లో దర్శకత్వం వహించే అవకాశాన్ని సంపాదించిన తెలుగు సినీ దర్శకుడు జగదీశ్ దానేటిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. హాలీవుడ్లో అవకాశం రావడం గొప్ప విషయమని అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో దానేటిని తలసాని సత్కరించారు. దానేటి భారత చిత్ర పరిశ్రమ నుంచి హాలీవుడ్లో నేరుగా సినిమా చేస్తున్న ప్రథమ దర్శకుడని కొనియాడారు. దేశం గర్వించే ఇండో-అమెరికన్ చిత్ర ఒప్పందాల విషయాన్ని సీఎం కేసీఆర్ తప్పకుండా ఆహ్వానిస్తారని, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగువాడు హాలీవుడ్లో దర్శకత్వం వహించటం గొప్ప విషయమని నటుడు అలీ చెప్పారు. తాను రాసుకున్న కథలే హాలీవుడ్ ఎంట్రీకి కారణమని దర్శకుడు జగదీశ్ దానేటి చెప్పారు. ఫిబ్రవరి, మార్చిలో జానీ మార్టిన్, పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధుల సమక్షంలో ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.













