సినిమాల ఎంపిక విషయంలో ప్రభాస్ తప్పు చేస్తున్నాడా?
ప్రభాస్‌కి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలికి ముందు ప్రభాస్ రేంజ్ ఒకలా ఉంటే.. బాహుబలి తర్వాత మరోలా ఉంది. ఇకపై చేసే సినిమాలన్నీ అన్ని భాషల వారిని దృష్టిలో పెట్టుకునే చెయ్యాల్సి ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమా అంటే మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. దానికి తగ్గట్టుగానే సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించారు. కానీ, సౌత్‌లో ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. నార్త్‌లో మాత్రం సూపర్‌హిట్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తే.. నిర్మాతలకు 200 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడు రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేనట్టుగా కనిపిస్తోంది. పైగా రాధేశ్యామ్ అనే టైటిల్ కూడా హిందీ సినిమా టైటిల్లా అనిపిస్తోంది తప్ప తెలుగు సినిమా అనే ఫీలింగ్ కలగడం లేదు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత వస్తున్న రాధేశ్యామ్ ఓ సాధారణ సినిమా అనిపించుకుంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి.
ప్రభాస్ సినిమా అనగానే భారీతనం కనిపించాలి. అవసరం ఉన్నా లేకపోయినా భారీ బడ్జెట్‌తోనే సినిమా తియ్యాలని నిర్మాతలు భావిస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్‌కి అంత మార్కెట్ ఉంది మరి. సినిమాకి కావాల్సింది భారీ బడ్జెట్ కాదని, ప్రేక్షకుల్ని కట్టిపడేసే కంటెంట్ అని దర్శకనిర్మాతలు తెలుసుకోవాలి. అంతేకాదు, తను చేసే సినిమా కథ, కథనాలు ఎలా ఉండాలి, ఎలాంటి కథతో సినిమా చేస్తే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలం అనే జడ్జిమెంట్ ప్రభాస్‌కి కూడా ఉండాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ చేసే రెండు సినిమాలు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని నిరాశపరిచేవిగానే కనిపిస్తున్నాయి. ఒకటి సోషియో ఫాంటసీ సినిమా అయితే, మరో సినిమా రామాయణాన్ని బేస్ చేసుకొని చేసే సినిమా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి ఆ రెండు సినిమాలకు ఎలాంటి పొంతన లేదు. ఒకవేళ ఆ కంటెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చెయ్యగలరా అంటే ప్రతి ఒక్కరికీ రాజమౌళికి కుదిరినట్టు కుదరదు కదా. మహానటి వంటి క్లాసిక్ మూవీ తీసి అందరి ప్రశంనలు అందుకున్న నాగ్అశ్విన్.. ప్రభాస్ వంటి పెద్ద హీరోని హ్యాండిల్ చెయ్యడం, ఒక సోషియో ఫాంటసీ కథాంశాన్ని ప్రేక్షకుల్ని రంజింపజేసేలా తెరకెక్కించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదని కొందరి అభిప్రాయం.
మరో సినిమా ఆదిపురుష్ చిత్రాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా ప్రభాస్ తప్పు చేశాడనే భావనే కలుగుతుంది. హిందీలో తానాజీ వంటి గొప్ప సినిమా ఓంరౌత్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ వేరు. అతనితో సినిమా చెయ్యాలంటే ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనేది బాగా తెలిసి ఉండాలి. అంటే రాజమౌళిలా ఆడియన్స్ పల్స్‌పై గట్టి పట్టు ఉండాలి. ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించి అందిన అప్డేట్స్ ప్రకారం ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ కూడా ఒక నార్మల్ సినిమాగా మిగిలిపోతుందని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాల బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోతుంది. మరి ఈ మూడు సినిమాల ఫలితం ఎలా ఉండబోతుంది? ప్రభాస్ రేంజ్‌ని మరింత పెంచడానికి ఈ సినిమాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.













