ముల్లోక వీరుడి కోసం హీరోయిన్ల వేట
వాల్తేరు వీరయ్య విజయం ఇచ్చిన కిక్‌తో ఫుల్ జోష్ లో మెహర్ రమేష్ తో భోళా శంకర్ చేస్తున్న చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాల్లో ఓ మూవీ వశిష్ఠతో చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
బింబిసార సినిమాతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ఠ తన రెండో సినిమాను కూడా అదే ఫాంటసీ జానర్ లో తెరకెక్కించాలని డిసైడయ్యాడట. జగదేకవీరుడు అతిలోకసుందరి మాదిరి ఓ విజువల్ గ్రాండియర్‌ని వశిష్ఠ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ముల్లోక వీరుడు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారని టాక్.
ఇక అసలు విషయానికొస్తే ఈ మూవీలో చిరూకి జోడీగా 8 మంది హీరోయిన్లు కావాలట. ముల్లోకాల నుంచి వచ్చే అందాల భామలు హీరో కోసం సాగించే వేట, కథలో కీలక పాయింట్‌గా తెలుస్తోంది. అందుకే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేలా కాకుండా ఒకేలా ఆ పాత్రలను డిజైన్ చేసుకున్నాడట వశిష్ఠ. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉంటే ఇప్పుడు చిరూ లాంటి సీనియర్ హీరోకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది హీరోయిన్లు దొరకడం అంటే పెద్ద టాస్కే.
ప్రస్తుతం ముల్లోక వీరుడు స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దాన్ని పూర్తి చేస్తూనే వశిష్ఠ క్యాస్టింగ్ వర్క్స్ కూడా చూసుకుంటున్నాడని సమాచారం. దీని కోసం కేథరిన్, ఈషా రెబ్బా, మంజు వారియర్, రెజీనా, నిత్య మీనన్,అపర్ణ బాలమురళి, నిత్య మీనన్ లాంటి హీరోయిన్లను వశిష్ఠ సంప్రదించే పనిలో ఉన్నాడట. మరి ముల్లోక వీరుడికి హీరోయిన్ల సమస్య ఎలా తీరుతుందో చూడాలి.













