అందరి కంటే ముందు రానున్న నాగ్?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతుంది. సంక్రాంతి సినిమాల పోరు చాలా రసవరత్తరంగా ఉండబోతుంది. ఇప్పటి వరకూ ఏ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కాలేదు కానీ ఏ సినిమాకు ఆ సినిమానే తమ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతుంటే, జనవరి 13న ఈగల్, సైంధవ్ సినిమాలు వస్తున్నాయి.
ఇప్పటివరకు అయితే ఈ సినిమాలు పక్కాగా డేట్ను ఫిక్స్ చేసుకుని షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇక వీటితో పాటూ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సెంటిమెంట్ ను వదలకూడదని చాలా పట్టుదలతో ఉన్న నాగార్జున ఆ దిశగానే షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు.
అయితే ఎప్పటిలా కాకుండా నాగ్ ఈ సారి అందరికంటే ముందొచ్చే ఆలోచన చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. జనవరి 10 లేదా 11న నా సామిరంగ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట నాగ్. కంటెంట్ పై నమ్మకముంది కాబట్టి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, దాని వల్ల తర్వాత వచ్చే సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద పీట వేస్తారని నాగ్ ఆలోచన. త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ట్రైలర్ తో పాటూగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.













