యాంగ్రీ మ్యాన్‌కు ఎక్స్ట్రా హిట్ ఇస్తుందా?
నితిన్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్స్ట్రా మూవీలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేశాడన్న విషయం తెలిసిందే. ట్రైలర్ లో ఆయనకు సంబంధించిన షాట్ ఒక్కటే చూపించడంతో ఎక్స్ట్రా మూవీలో ఆయన పాత్ర నిడివి ఎంతన్నది స్పష్టత లేదు.
మొన్నటి వరకు హీరోగా సినిమాలు చేసిన రాజశేఖర్, ఇప్పుడు ఈ సినిమాతో సపోర్టింగ్ రోల్‌కు షిఫ్ట్ అయ్యాడు. అలాంటప్పుడు రాజశేఖర్ బ్రాండ్‌ను చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో వాడుకోవచ్చు. కానీ మేకర్స్ మాత్రం ఆ పని చేయడం లేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజశేఖర్ చేస్తున్న పాత్ర విలన్ రోల్ కాదు.
ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది తప్పించి, సినిమా కథను మలుపు తిప్పే పాత్రైతే కాదని తెలుస్తోంది. ఎంతో కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ కు ఇప్పుడు అర్జెంటు గా ఓ హిట్ అవసరం. ఒకవేళ ఎక్స్ట్రా హిట్ అయితే ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ ఆయనకు క్యూ కట్టే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. మరి రాజశేఖర్ కు ఎక్స్ట్రా సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













