మీడియాను టార్గెట్ చేసిన రియా.. న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైన సుశాంత్ ప్రియురాలు!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరగడం, పలువురు సినీ ప్రముఖులను ఈ కేసులో విచారించడం జరిగింది. అతని ప్రియురాలు రియా చక్రవర్తిని ప్రధానంగా విచారించడం ప్రారంభించిన పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలోనే డ్రగ్స్ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో రియా ప్రధాన భూమిక పోషించిందని తెలిసింది. పోలీసుల విచారణలో ఆమె చాలా మంది ప్రముఖ హీరోయిన్ల పేర్లను వెల్లడించింది. దీంతో పోలీసులు వారిని కూడా విచారించడం, నోటీసులు పంపించడం చేశారు. చాలా ప్రయత్నాల తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రతి పది రోజులకు ఒకసారి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని కోర్టు సూచించింది. దానికి ఆమె అంగీకరించింది. బయటికి వచ్చిన రియా ఇప్పుడు మీడియాపై నిప్పులు చెరుగుతోంది. మీడియాపై న్యాయపోరాటానికి సిద్ధమైంది.
ఈ కేసులో కావాలని తన పేరును ఇరికించారని, దానికి తగ్గట్టుగానే మీడియాలో వార్తలు ప్రసారం చేసారని ఆమె మండిపడ్డారు. అందుకే ఆ వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని రియా చెబుతోంది. మీడియాలో పలు మార్లు రియా పేరు వినిపించడం వల్ల ఆమె పరువుపోయిందని ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు.
రియా తీసుకున్న నిర్ణయానికి కొందరు మీడియా ప్రముఖులు మద్దతు ఇస్తామని అన్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ అభిమానులు రియాపై మండిపడుతున్నారు. ఆమె చర్యల వల్లే తమ అభిమాన హీరో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందరి దృష్టినీ మళ్లించడానికి ఇప్పుడు రియా కొత్త నాటకం ఆడుతోందని సుశాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అసలు సుశాంత్ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సుశాంత్ అభిమానులు కోరుతున్నారు.













