‘నా రాత నేనే రాసుకుంటా’ చిత్రంతో ఇలియానా టాలీవుడ్ లో రీ ఎంట్రీ!
వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన `దేవదాసు` చిత్రం ద్వారా రామ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో వారిద్దరి కెరీర్‌కి మంచి పునాది పడింది. ఇద్దరూ ఇండస్ట్రీలో మంచి రేంజ్‌కి వెళ్లారు. అయితే రామ్ ఇప్పటికీ హీరోగా తన హవా కొనసాగిస్తుంటే, ఇలియానా మాత్రం కొన్ని సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇద్దరూ ఒకే సినిమా ద్వారా పరిచయమైనప్పటికీ ఇలియానా రామ్ కంటే ఆరు నెలలు వయసులో పెద్దది కావడం విశేషం. దేవదాసు తర్వాత వెంటనే మహేష్‌తో పోకిరి సినిమాలో నటించే అవకాశం రావడంతో ఇలియానా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక వరసగా సినిమాలు చేస్తూ తెగ బిజీ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాల్లో నటించింది.
ఈమధ్యాకాలంలో ఆమెకు అవకాశాలు బాగా సన్నగిల్లాయి. చేతిలో ఒక్క సినిమా కూడా లేని సమయంలో రవితేజ తను నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఈ సినిమా తర్వాత హిందీలో పాగల్ పంతి పేరుతో రూపొందిన ఓ మల్టీస్టారర్‌లో నటించినా ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో ఇలియానాకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ది బిగ్బుల్ పేరుతో రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తనకు హీరోయిన్గా మంచి బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆమెను ఎంతో బాధిస్తోందట. అయితే తాజాగా ఇలియానా ఓ తెలుగు సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది.
నాగార్జున హీరోగా `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన ఇలియానా నటించనుందని సమాచారం. ఈ సినిమాకు `నా రాత నేనే రాసుకుంటా` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.













