ప్రసాద్ స్టూడియో వ్యవహారంలో కేసు వెనక్కి తీసుకున్న ఇళయరాజా
సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రసాద్ స్టూడియోపై వేసిన కేసును వెనక్కి తీసుకున్నారు. చెన్నైలోని సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజాసంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు స్టూడియో అధినేతలు కూడా ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి గదిని ఇవ్వాలన్న ఇళయరాజా కోరికను ఎందుకు అంగీకరించరని ప్రసాద్ స్టూడియో అధినేతలను న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు స్టూడియో అధినేతలు ఇళయరాజా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బదులిచ్చారు. దీనికి బదులివ్వాల్సిందిగా ఇళయరాజాను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇళయరాజా కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు.













