Shilpa Shirodkar: దుఃఖంతో తల గోడకేసి కొట్టుకోవాలనిపించేది

నమ్రతా శిరోద్కర్(Namratha Shirodkar) చెల్లిగా శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar) అందరికీ పరిచయమే. నమ్రత లానే శిల్ప కూడా ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. బ్రహ్మ(Brahma) అనే తెలుగులో సినిమాలో కూడా శిల్ప నటించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన శిల్పా న్యూజిలాండ్ వెళ్లి అక్కడే ఫ్యామిలీతో సెటిలైంది. కొన్నేళ్ల పాటూ అక్కడే ఉన్న శిల్పా తిరిగి 2010లో ఇండియాకు వచ్చింది.
అయితే శిల్పా తిరిగి ఇండియా వచ్చింది సినిమాల్లో నటించడానికే అని తిరిగి ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇవ్వడానికే శిల్పా వచ్చిందని వార్తలు రాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది శిల్పా. తక్కువ గ్యాప్ లోనే అమ్మానాన్నలను కోల్పోవడంతో ఎంతో ఒంటరిగా ఫీలైన తాను, కనీసం తనకంటూ మిగిలిన అక్క నమ్రతకు అయినా దగ్గరగా ఉండాలని న్యూజిలాండ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చినట్టు తెలిపింది.
తాను సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనకు ఆ ఆలోచన కూడా లేదని శిల్పా తెలిపింది. అమ్మా నాన్న చనిపోయాక చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని, దుఃఖంతో కుమిలిపోయానని, ఆ బాధతో జీవితంపై విరక్తి వచ్చేసిందని, తల గోడకేసి కొట్టుకోవాలనిపించేదని, కొన్ని సార్లు ఆ కోపాన్ని భర్త, కూతురిపై కూడా చూపించానని, కూతురిపై పలుమార్లు చేయి చేసుకున్నానని, ఎంత బాధలో ఉన్నా తన అక్క నమ్రతతో మాత్రం బాగా మాట్లాడేదాన్నని, ఆమొక్కటే తనను బాగా అర్థం చేసుకునేదని శిల్పా శిరోద్కర్ తెలిపింది.