సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్న హైపర్ ఆది
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరగిపోయాయి. టెక్నాలజీ పెరగడం, దానికి తోడుగానే నేరాలు కూడా పెరగడం జరుగుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్… ఇలా సోషల్ మీడియాలోని కొన్ని మాధ్యమాల ద్వారా దొంగ ఎకౌంట్లు క్రియేట్ చేసి కొంతమంది అమాయకులను వివాదాల్లోకి లాగుతున్నారు కొందరు నేరగాళ్ళు. ఇప్పడు హైపర్ ఆదిని కూడా ఆ లిస్ట్‌లో చేర్చారు. అతని పేరు మీద దొంగ ఎకౌంట్ క్రియేట్ చేసి కొన్ని వివాదాస్పద పోస్టులను పెడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన హైపర్ ఆది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించాడు.
“ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నా పేరు మీద ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసి ప్రభుత్వంపై నేను విమర్శలు చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు. ఆ ఎకౌంట్లకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వాన్ని, ప్రజాభిప్రాయాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నవారిని ఊరికే వదిలిపెట్టదలుచుకోలేదు. వెంటనే నేను ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళబోతున్నాను“ అన్నారు హైపర్ ఆది. హైపర్ ఆది.. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. జనసేన పార్టీకి ఆది సేవలు అందిస్తూ ఉంటాడు. దీంతో ఆది పేరుతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు. దాన్ని జనసేన అభిప్రాయంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించే కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ విషయం ఆది దృష్టికి రావడంతో పై విధంగా స్పందించాడు.













