కన్నడ రీమేక్ ‘లవ్ మాక్ టైల్’ లో సత్య దేవ్, తమన్నా
టాలీవుడ్ లో వరుసగా ఇరుగు పొరుగు భాషల చిత్రాలు రీమేకవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలు మలయాళ బ్లాక్ బస్టర్ల రీమేక్ లకు మెగా ఫ్యామిలీ హీరోలు సన్నాహకాల్లో ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఇప్పటికే పలు మలయాళ రీమేక్ లను లాక్ చేసి కాస్టింగ్ సెలెక్షన్స్ తో బిజీగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. `లవ్ మాక్ టైల్` 2020 జనవరిలో రిలీజైన కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం. కృష్ణ దర్శకత్వం వహించగా.. కృష్ణ- మిలానా నాగరాజ్ నిర్మించారు. దర్శకనిర్మాతలే ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమకోసం తపించే యువతరం కథాంశమిది. తెలుగు యూత్ కి నచ్చేస్తుందనే క్యాలిక్యులేషన్ తోనే తాజా రీమేక్ కి ప్లాన్ చేస్తున్నారట.
మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తరహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఇదని చెబుతున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ కన్నడ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.













