విజయశాంతి చెయ్యను అంది.. ఖుష్బూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!
‘రన్ రాజా రన్`తో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు సుజిత్‌కి రెండో అవకాశం అదృష్టంలా `సాహో` రూపంలో వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా నిర్మాతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అయితే తన మూడో సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు సుజిత్. మలయాళంలో సూపర్‌హిట్ అయిన `లూసిఫర్` చిత్రాన్ని చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సుజిత్ దర్శకుడైతే బాగుంటుందని చిరంజీవి సూచించడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాడు. చిరంజీవి సహకారంతో లూసిఫర్ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులతో ఒక దారికి తెచ్చారట. ఇప్పడు ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందనే విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
మోహన్‌లాల్ క్యారెక్టర్‌ను చిరంజీవి పోషిస్తుండగా, మరో హీరోగా రానా పేరు వినిపిస్తోంది. అలాగే రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్‌గా ఈ విషయాలన్నీ కన్ఫర్మ్ చెయ్యాల్సి ఉంది. ఇక మిగిలిన పాత్రల్లో ముఖ్యమైనవి చిరంజీవి చెల్లెలి పాత్ర, ఆమె భర్త పాత్ర. ఈ రెండు పాత్రలకు సంబంధించి నటీనటులు కన్ఫర్మ్ అయిపోయారని తెలుస్తోంది. మొదట చిరంజీవికి చెల్లెల్లుగా నటించాల్సిందిగా విజయశాంతిని చిత్ర యూనిట్ సంప్రదించిందట. కానీ, తాను చిరంజీవికి చెల్లెలుగా నటించనని చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
మలయాళంలో మంజు వారియర్ చేసిన ఈ పాత్రకు సుహాసిని అయితే పక్కాగా సరిపోతుందని, ఆమెనే ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రలో ఖుష్బూ నటించబోతోందనేది తాజా సమాచారం. మలయాళంలో మంజు వారియర్ భర్త పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించాడు. ఆ పాత్రను తెలుగులో జగపతిబాబు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై జగపతిబాబును చిత్ర యూనిట్ ఫోన్లోనే సంప్రదించిందట. ఆ క్యారెక్టర్ చేసేందుకు జగపతిబాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.













