సమాజం కోసం పిల్లలు వద్దనుకున్న మహామనిషి
కొరటాల శివ… రచయితగా కెరీర్‌ను ప్రారంభించి దర్శకుడుగా ఎదిగాడు. తను చేసే ప్రతి సినిమాలోనూ సమాజానికి ఉపయోగ పడే ఏదో ఒక అంశం ఉండాలని తపన పడే వ్యక్తి. దర్శకుడిగా చేసింది నాలుగే సినిమాలు. ఆ నాలుగు సినిమాలూ నాలుగు ఆణిముత్యాలు. పగ, ప్రతీకారాల కంటే ప్రేమ గొప్పదని తన మొదటి సినిమా `మిర్చి`లో సందేశాన్ని ఇచ్చాడు. తమకు అన్నీ ఇచ్చిన ఊరికి ఏదో చెయ్యాలని ఆ ఊరిని దత్తత తీసుకొని బాగు చెయ్యడం అనే కాన్సెప్ట్‌తో రూపొందింది `శ్రీమంతుడు`. పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనను కాపాడుతుంది అనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా `జనతా గ్యారేజ్`. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ, వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా మహేష్ నటించిన `భరత్ అనే నేను` చిత్రం కొరటాల శివ దర్శకత్వంలోనే రూపొందింది. ప్రస్తుతం కొరటాల చేస్తున్న `ఆచార్య` చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని పర్యావరణ పరిరక్షకుడిగా చూపించబోతున్నారు. ఈ నాలుగు సినిమాల నేపథ్యాన్ని గమనిస్తే శివకు సామాజిక స్పృహ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది.
ఆమధ్య ఓ మీడియా సమావేశంలో.. మీకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కనలేదు ఎందుకని అడిగిన ప్రశ్నకు కొరటాల శివ మౌనమే సమాధానమైంది. ఆ ప్రశ్నకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. “కొరటాలను నేను దర్శకుడిగా కంటే కూడా వ్యక్తిగా చాలా గౌరవిస్తాను. అలాంటి వ్యక్తిని నా జీవితంలో మళ్లీ చూస్తానని కూడా అనుకోవడం లేదు.
సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా కొరటాలకు నూటికి నూరు మార్కులు వేస్తాను. తనతో పాటు తన భార్య సంపాదించే దానిలో సగం సమాజం కోసమే ఖర్చు చేయడం అనేది అభినందనీయం. సమాజం కోసమే పిల్లలను కూడా వద్దనుకున్న మహా మనిషి కొరటాల శివ“ అని తెలిపారు. ఈ విషయం విన్న తర్వాత కొరటాలపై ఎవరికైనా గౌరవం పెరిగిపోతుంది. సమాజమే తనకు పిల్లలు అనుకునే వాళ్లు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? సందేశాలు ఇవ్వడం సినిమాల వరకే పరిమితం చేసుకోకుండా నిజజీవితంలోనూ అదే మార్గంలో ప్రయాణిస్తున్న కొరటాల శివను అభినందించాల్సిందే.













