నవల ఆధారంగా వైష్ణవ్‌తేజ్ హీరోగా క్రిష్ కొత్త సినిమా!
గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకున్న క్రిష్ తాజాగా పవన్‌కల్యాణ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్ష పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ బందిపోటు దొంగగా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణం నిలిచిపోయింది. ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో మరో సినిమాని రూపొందించేందుకు క్రిష్ సిద్హమవుతున్న విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ సోడరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా `ఉప్పెన` చిత్రం రూపొందింది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొంది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇదిలా ఉంటే క్రిష్ తెరకెక్కించబోయే సినిమాలో వైష్ణవ్‌తేజ్ హీరోగా నటించనున్నాడు.
తన ప్రతి సినిమాకీ ఓ విభిన్నమైన కథను ఎంచుకునే క్రిష్ ఈ సినిమా కోసం ఓ నవలను ఎంపిక చేసుకున్నాడు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` అనే నవల ఆధారంగా కథను సిద్ధం చేశాడు. పశువులను మేపడానికి నెలల కొద్దీ అడవుల్లో గడిపే వారి జీవితాలపై ఈ నవలను రాశారు వెంకటరామిరెడ్డి. ఈ నవలను సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులతో అద్భుతమైన కథగా రూపొందించారు క్రిష్. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. పూర్తిగా వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపాలని క్రిష్ భావిస్తున్నాడు. తొలి సినిమా `ఉప్పెన` విడుదల కాకముందే క్రిష్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో వైష్ణవ్‌తేజ్ చేయనున్న ఈ సినిమా అతని కెరీర్‌కి మంచి పునాది అవుతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా గురించి, ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.













