ఆ ధైర్యమే కరోనా నుంచి మమ్మల్ని కోలుకునేలా చేసింది
హీరో విశాల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి జి.కె.రెడ్డికి మొదట పాజిటివ్ వచ్చింది. ఆయనకు 82 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన్ను హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించే ఉద్దేశం విశాల్‌కు లేదు. ఆయన్ను ఇంట్లోనే ఉంచి చూసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో విశాల్‌కి కూడా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు, అతని మేనేజర్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇంట్లోనే ఉంటూ ఒక డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స పొంది ముగ్గురూ కోలుకున్నారు. ఈ సందర్భంగా తాము ఎలా కోలుకున్నదీ తెలిపేందుకు ఓ వీడియోను విడుదల చేశాడు విశాల్.
“నాన్నగారికి జూన్‌లో కరోనా పాజిటీవ్ వచ్చిందని ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టాను. ఆయన ద్వారా నాకు వచ్చింది. నాతో పాటు నాకు దగ్గరగా ఉండే మా మేనేజర్‌కి కూడా పాజిటీవ్ వచ్చింది. మా అంకుల్ డాక్టర్ హరిశంకర్గారి సమక్షంలో ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాం. ఈ వైరస్‌కి వైద్యం కంటే మనో ధైర్యం చాలా ముఖ్యమైందని నేను గమనించాను. ధైర్యంగా ఉంటే తప్పకుండా ఈ వైరస్‌ని ఎదుర్కోవచ్చు. ఆ ధైర్యం వల్లే మూడు వారాల్లో మేం కోలుకున్నాం. అలాగే మా డాక్టర్ ఇచ్చిన మందులు కూడా మాకు హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా 82 సంవత్సరాలున్న నాన్నగారికి చాలా హెల్ప్ అయింది. ఈ సందర్భంగా మా అంకుల్ డాక్టర్ హరిశంకర్ గారికి దన్యవాదాలు తెలుపుతున్నాను. మన జీవితంలో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు చూస్తాం. ఇదీ అలాంటి ఒక ఎక్స్‌పీరియన్సే. ఒక సినిమా ప్రారంభంలో సామాజికసృహతో ఎన్నో వీడియోలు వేస్తాం అలానే ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను తప్ప నేను డాక్టర్స్, హాస్పిటల్స్, మెడిసిన్ వ్యవస్థకి వ్యతిరేకం అని కాదు. మాకు ఏ మెడిసిన్ ఉపయోగపడిందో ఆ వివరాలు నా ట్విట్టర్ అకౌంట్లో ఉంచడం జరిగింది. అందరూ దైర్యంగా ఉండండి తప్పకుండా మనం ఈ కరోనాను జయించగలం“ అన్నారు.













