స్కూళ్లపై”‘శివా”‘లు..కొనసాగిస్తున్న దంపతులు
గత కొన్ని రోజులుగా నటుడు శివబాలాజీ ఆయన భార్య నటి మధుమితలు వార్తల్లో తరచు కనిపిస్తున్నారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్లో ఫీజలు తగ్గించమని అడిగిన పేరెంట్స్కు తాము మద్ధతు పలికామనే కారణంతో తమ పిల్లలను ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించారంటూ వీరు గళమెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది పేరెంట్స్ నుంచి వీరికి అనూహ్య మద్ధతు లభించింది. మీడియా కూడా వీరి మాటలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ గొడవ హెచ్చార్సీ దాకా వెళ్లడం, ఆ తర్వాత శివబాలాజీ పిల్లలు చదువుతున్న స్కూలు యాజమాన్యం దిగి వచ్చి తాను తీసేసిన పిల్లలందరినీ తరిగి క్లాసుల్లోకి తీసుకోవడం కూడా వరుసుగా జరిగిపోయాయి.
అయినప్పటికీ శివబాలాజీ దంపతులు మాత్రం పట్టు వీడడం లేదు. ఇది తమ పిల్లలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని వీరంటున్నారు. దీన్ని వదలబోమని స్పష్టం చేస్తున్నారు. ఆ మాటలకు కట్టుబడుతూ శుక్రవారం కూడా వీరు ఈ ఫీజుల విషయమై స్పందించారు. కరోనా కాలంలోనూ ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, అనేక స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లన్నీ ఓ ముఠాగా ఏర్పడినట్టు అర్థమవుతోందని ఆరోపించారు.ఇకపై అధిక ఫీజులు వసూళ్లు చేసే స్కూళ్లపై పోరాడడమే తన లక్ష్యమని శివబాలాజీ స్పష్టం చేశారు. స్కూళ్ల యాజమాన్యాల కారణంగా బాధితులైన తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపారు. శివబాలాజీ భార్య మధుమిత స్పందిస్తూ, ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా, ప్రైవేటు స్కూళ్లు అనేక రకాల ఫీజులతో మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తాము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించినా, పూర్తి ఫీజు చెల్లించేవరకు తమ పిల్లలను పరీక్షలు రాయనివ్వబోమని చెబుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి ఈ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.













