Sri Chidambaram: ‘శ్రీ చిదంబరం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో సత్య దేవ్

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’ (Sri Chidambaram). వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ టీజర్‌ను గమనిస్తే.. ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాను ఎంతో అందంగా చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు.
టీజర్ లాంఛ్‌లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ .. ‘‘క’ సినిమాతో చింతా గోపాల కృష్ణా రెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు. ‘శ్రీ చిదంబరం’ కథను నాకు ముందు చెప్పారు. ‘కథ చాలా బాగుంది.. ఈ మూవీతో నాకేమీ డబ్బులు రావాలని అనుకోవడం లేదు.. మంచి కథను ఆడియెన్స్‌కి అందించాలని అనుకుంటున్నాను’ అని నిర్మాత గోపాల కృష్ణా రెడ్డి గారు అన్నారు. అలా అనగలిగే నిర్మాత ఉండటం చాలా అరుదు. వినయ్ రత్నం మంచి కథను అద్భుతంగా చూపించారు. వంశీ తుమ్మల అద్భుతంగా నటించారు. సంధ్య ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఈ టీజర్‌లో మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అంతకంటే బాగున్నాయి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలన కోరుకుంటున్నాను. ఫ్రమ్ ది ‘క’ మేకర్స్ అని ఇప్పుడు వేసుకున్నారు.. తరువాత ఫ్రమ్ ది ‘రావు బహదూర్’ అని, ఫ్రమ్ ది ‘శ్రీ చిదంబరం’ మేకర్స్ అని కూడా వేసుకుంటారు’ అని అన్నారు.
దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ .. ‘యంగ్ టీం అంతా కలిసి చేసిన ‘శ్రీ చిదంబరం’ టీజర్ చాలా బాగుంది. గోపాల కృష్ణ రెడ్డి చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఈ చిత్రంతో వారి పిల్లలు కూడా నిర్మాతలుగా ‘శ్రీ చిదంబరం’ వస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని, టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
వెంకటేష్ మహా మాట్లాడుతూ .. ‘నా రైటర్స్ క్లబ్ నుంచి వినయ్ రత్నం రావడం, ఇలా మంచి సినిమాను తీయడం నాకెంతో గర్వంగా ఉంది. మీ శిష్యుడు చెప్పిన కథ బాగుంది అని గోపాల కృష్ణ రెడ్డి గారు నాతో అన్నారు. నాకు శిష్యుడు ఏంటి? అని అనుకున్నా. వినయ్ రత్నం నా నుంచి ఎలాంటి సపోర్ట్‌ని కోరుకోలేదు. చాలా నమ్మకంగా ఉన్నాను.. సినిమాను బాగా తీస్తాను అని వినయ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ మూవీని నేను దాదాపు పూర్తిగా చూశాను. మారెడుమిల్లిలో ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయా? అని నాకు అనిపించింది. హీరో వంశీ చక్కగా నటించారు. సంధ్య అయితే ఎంతో సహజంగా నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి చిత్రాలు హిట్ అయితే నిర్మాత గోపాల కృష్ణ గారు మరిన్ని చిత్రాలు నిర్మిస్తారు’ అని అన్నారు.
నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘శ్రీ చిదంబరం’ కథను వినయ్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ప్రొడక్షన్ అంతా కూడా మా పిల్లలు చూసుకున్నారు. ఈ కథ కోసం, పాత్ర కోసం వంశీ పడిన కష్టం నాకు తెలుసు. మాకు నిత్యం ఎన్నో కథలు వస్తుంటాయి.. కానీ అందులో నాకు నచ్చిన ఈ కథను ఎంచుకున్నాను. మా టీం కోసం వచ్చిన సత్యదేవ్ గారికి, వశిష్ట గారికి, వెంకటేష్ మహా గారికి, యువ దర్శకులందరికీ థాంక్స్. గ్లామర్ కంటే గ్రామర్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చి కొత్త ఆర్టిస్టులతో సినిమాను తీశాం. మా వరకు మేం వంద శాతం ప్రయత్నించి సినిమాను తీశాం. ఈ మూవీని మీడియానే ముందుకు తీసుకు వెళ్లాలి’ అని అన్నారు.
హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ .. ‘మాది రాజమండ్రి. నాకు యాక్టర్ అవ్వాలనే కల ఉండేది. ఆ కల ఈ రోజు నెరవేరింది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇక్కడి వరకు వచ్చాను. వినయ్‌తో నా జర్నీ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. మా ఇద్దరికీ కూడా సినిమాల్లోకి రావాలనే కల ఉండేది. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సినిమా అందరికీ నచ్చుతుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ .. ‘రెండేళ్లు నేను ఈ కథను పట్టుకుని అన్ని ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగాను. కానీ నేను నా ఆర్టిస్టులతోనే ఈ కథను చెప్పాలని అనుకున్నాను. మలయాళంలో మూవీని తీసి తెలుగులోకి తీసుకు రావాలని అనుకున్నాను. క్రౌడ్ ఫండింగ్‌తో ఈ మూవీని తెలుగులో చేయాలని అనుకున్నాను. అప్పుడు వినీషా గారి వద్దకు మా కథ వెళ్లింది. అలా గోపాలకృష్ణ రెడ్డి గారు మాకు అండగా నిలిచారు. మా కోసం వచ్చిన యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ థాంక్స్. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే.. ఆ యూనివర్స్ మనకు సహాయం చేస్తుందడానికి ఇదే ఉదాహరణ. వెంకటేష్ మహా గారి ‘కేరాఫ్ కంచరపాలెం’ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా స్నేహితులకు, ఫ్యామిలీకి థాంక్స్. టీజర్ నచ్చితే అందరికీ చెప్పండి. సత్యదేవ్ గారు మా కోసం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ‘క’ దర్శకులు సందీప్, సుజిత్, ఎదు వంశీ, సాయి మార్తాండ్, సింజిత్, నంద గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.