యంగ్ హీరోలను అనుసరిస్తున్న రవితేజ!
హీరోలు నిర్మాతలుగా మారడం, తమ అభిరుచి మేరకు సినిమాలు నిర్మించడం అనేది ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలం నుంచి వస్తోంది. దాన్నే ఇప్పటి హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు చే్స్తున్న టాప్ హీరోలందరూ నిర్మాతలుగా మారిన వారే, సినిమాలు నిర్మించినవారే. ఇప్పుడు వారి దారిలో రవితేజ కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అవును..
రవితేజ ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రవితేజ స్టార్ట్ చేయబోయే నిర్మాణ సంస్థలో అతను హీరోగా నటించే సినిమాలే కాదు, కొత్త తరహా కథలతో, కొత్త వారితో సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట. పాత తరం హీరోలను పక్కనపెడితే… ఈ తరం హీరోలు, యంగ్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే చిత్ర నిర్మాణంపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థను ప్రారంభించి తను హీరోగా నటించే సినిమాలకు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు
మహేష్. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలను తన బేనర్లో నిర్మించిన మహేష్ తాజాగా సర్కారువారి పాట చిత్రానికి కూడా వేరే బేనర్స్తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్లో సర్దార్ గబ్బర్‌సింగ్, నితిన్ హీరోగా చల్ మోహనరంగ చిత్రాలు నిర్మించాడు. రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో సంస్థను స్థాపించి ఖైదీ నంబర్ 150, సైరా వంటి భారీ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం దిల్‌రాజుతో కలిసి `ఆచార్య` చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తూనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
క్యలాణ్రామ్ `అతనొక్కడే` చిత్రం నుంచి తన సొంత బేనర్లో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. కొడుకు భార్గవ్‌రామ్, తండ్రి హరికృష్ణ పేర్లు కలిసి వచ్చేలా భార్గవ్హరి ప్రొడక్షన్స్ పేరుతో ఆ నిర్మాణ సంస్థ ఉంటుందని తెలుస్తోంది. వీరితోపాటు నాని, విజయ్‌దేవరకొండ, వరుణ్‌తేజ్ నితిన్, సందీప్ కిషన్, రానా, సుధీర్‌బాబు, విష్ణు వంటి హీరోలు కొన్ని సినిమాలకు సమర్పకులుగా, కొన్ని సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసిన రవితేజ త్వరలోనే తన సొంత ప్రొడక్షన్ హౌస్ వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.













