సిఎం జగన్ కల్పించుకోవాలన్న సినీహీరో రామ్…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జరిగిన కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం ఇప్పుడు సెలబ్రిటీ టర్న్ తీసుకుంది. హోటల్ స్వర్ణప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడచిన ఈ క్వారంటైన్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు ఆహుతి అవడం, పెద్ద సంఖ్యలో గాయాల పాలవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, ప్రభుత్వ శాఖలు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రమేష్ ఆసుపత్రిపై పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపధ్యంలో శనివారం సినీహీరో రామ్ ఈ ఉదంతంపై ట్వీట్ ద్వారా స్పందించాడు. తన తండ్రి సోదరుడిదైన రమేష్ ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఒక హోటల్లో అగ్నిప్రమాదం జరిగితే ఆ హోటల్ నిర్వాహకులను వదిలేసి అక్కడ ఆసుపత్రి నిర్వహించిన వారిని దోషులుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారన్నాడు రామ్. ఆసుపత్రి బిల్లింగ్ మొత్తం స్వర్ణా ప్యాలెస్ పేరు మీదే జరిగిందని, ఆ హోటల్‌కి ఏ విధమైన మునిసిపల్ అనుమతులు లేవన్నాడు. అదే హోటల్లో అంతకు ముందు ప్రభుత్వం కూడా క్వారంటైన్ సెంటర్ నడిపిందని అప్పుడే అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని బాధ్యల్ని చేసేవారని నిలదీశాడు. ఆసుపత్రినే లక్ష్యంగా చేసుకుని ఇరికించే యత్నం చేస్తున్నారని, అకారణంగా ఆసుపత్రి మీద బురదజల్లుతున్నారని ఆరోపించాడు. రాష్ట్ర సిఎం జగన్ దగ్గర పనిచేసే కొందరి ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని అయితే ఇదంతా ఆయనకు తెలీకుండానే జరుగుతోందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపధ్యంలో సిఎం జగన్ కలుగజేసుకుని దీనిపై తగిన విధంగా స్పందించాలన్నాడు. మరోవైపు రామ్ ట్వీట్‌కు ముందుగా రమేష్ ఆసుపత్రి యజమాని ఓ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. దాదాపు 73ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నామని, తమపై ఎటువంటి మచ్చా లేదన్నారు. తాను ఎటూ పారిపోలేదని, తమ ఆసుపత్రిపై కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.













